రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతులు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతులు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

6hr

Loading...

హైదరాబాద్, మే 24: రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అని అన్నారని పేర్కొన్నారు.

ఆదుకుంటామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.

వరంగల్ డిక్లరేషన్ అంటూ చెప్పడం తప్పితే.. రైతులకు చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అందుకే రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం నుంచి బీజేపీ నేతలమంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నామని తెలిపారు. రైతులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గన్ని సంచులు, సుతిలి దారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ధాన్యం తరలించేందుకు లారీలు కూడా లేవని తెలిపారు. తొలిరోజు పర్యటన తన పార్లమెంట్ పరిధిలోని చేవెళ్లలో ఉంటుందని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు.

ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం: బీజేఎల్పీ నేత

రైతులను దళారులు మోసం చేస్తున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 30 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కానీ సీఎం 80 శాతం కొనుగోలు చేశామని అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. మీకు అధికారులు సరైన లెక్కలు ఇవ్వడం లేదా? అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఎందుకు రైతులను గోస పెడుతున్నారంటూ ప్రభుత్వంలోని పెద్దలను ఆయన నిలదీశారు. ప్రతి గింజ కొంటామని మేనిఫెస్టోలో పెట్టారు.. బోనస్ అన్నారు.. ఏమైంది? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బల్లగుద్ది ప్రశ్నించారు.

దళారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బీజేఎల్పీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి.. ఆ భయంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. గన్ని సంచులు, లారీల సమస్య ఉందని చెప్పారు. తేమ పేరిట ఒక్కో సంచికి 4 కిలోలు మేర ధాన్యాన్ని తీసేస్తున్నారన్నారు. మరి ఆ ధాన్యం డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పాములు, తేళ్లని చూడకుండా పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితి.. రైతులకు ఏర్పడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా అబద్ధం చెప్పించారా? అంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను ఆయన నిలదీశారు. అకాల వర్షాలతో.. ఇబ్బందులు, పంట కాలి ఇంకొకరు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నట్లు దీని ద్వారా అర్థమవుతోందన్నారు. మొక్కజొన్న, జొన్న పంటను కూడా పూర్తిగా కొనుగోలు చేయకుండా సర్కార్ చేతులెత్తేసిందన్నారు.

4.8 లక్షల పొద్దు తిరుగుడు పువ్వు పంట వేస్తే.. కొంత మొత్తంలో కొనుగోలు చేసి రైతులను గాలికొదిలేశారని విమర్శించారు. అందుకే చేవెళ్ల నుంచి రైతు ఘోష.. బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నామని వివరించారు. మూడ్రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ కదులుతోందని తెలిసి పలు జిల్లాల కలెక్టర్లలో కదలిక వచ్చి.. ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పారని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy

Comments

1
Loading comments...