'ఎస్టీ కాలనీ' అని పిలవబడే ఒక ఎరుకుల సమూహాన్ని 'ఏకలవ్య కాలనీ'గా పిలుచుకోవడం వెనుక ఆ ఊరి యువత ఆలోచన బైటి నుంచి చూస్తే సాధారణమైనదిగా కనపడవచ్చు. కానీ పలమనేరు బాలాజి 'ఏకలవ్య కాలనీ - ఎరుకల జీవనగాథలు' పుస్తకం చదివినాక ఆలోచిస్తే ఆ ప్రయత్నం మామూలుది కాదు అనిపిస్తుంది.
స్వతంత్ర భారత దేశంలో మూలవాసులైన గిరిజనులపై వారి వారి జీవన విధానాల ఆధారంగా రాజ్యం రాసిన నెగెటివ్ హిస్టరీని రీరైట్ చెయ్యాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తాయి ఈ పుస్తకంలోని కథలు.
అడవి తీరప్రాంతాన, వ్యవసాయ ప్రధానంగా జీవనం సాగిస్తున్న ఒక ఆదిమ సమాజం దొంగలుగా చిత్రించబడటం ఒక కుట్ర. ఒక సమూహాన్నే వెలి వేయడం, నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం ఒక వ్యూహం. అందులో భాగంగానే పాలకుల తీరు, ఇతర సమాజాల అణచివేత ఒక పథకం ప్రకారం జరుగు తున్నదని మనకు అర్థం చేయిస్తుంది ఈ పుస్తకం. ఈ కథల్లో ఒక కాలేజీ కుర్రాడు కొత్త ఫోను పట్టుకుని కాలేజీకి వెళ్తే ''యాడ కొట్టుక్కొస్తివిరా ఇంత కొత్త ఫోను'' అని ప్రశ్నిస్తుంది ఇతర సమాజం. అదే కథలో మరోచోట ''మీకే మప్పా, మీరు దేవుడి బిడ్డలు. రిజర్వేషన్లున్నాయి'' ఎత్తి పొడుస్తుంది. మరి స్వతంత్ర స్వర్ణోత్సవ సమయానికి ఈ పాత్ర తండ్రి ఎలా జీవించి వుంటాడు? ఎన్ని అవమానాల్ని ఎదుర్కొని వుండివుంటాడు? ఆ ముందు తరం ఏ మానసిక వేదనని మోస్తూ దాన్ని నేటి తరానికి వారసత్వంగా ఇచ్చి వుంటుంది? ''అభివృద్ధి, మార్పు, సమానత్వం అనేవి రావడానికి ఇంకా ఎన్నేళ్ళు వెయిట్ చెయ్యాలి సార్?'' అని మరో చోట ప్రశ్నిస్తుంది ఇదే కథలో మరో పాత్ర. ఈ మాటలో వెయిటింగ్ పట్ల అసహనం కనిపిస్తుంది. ఇది తరాల నిరీక్షణ.
ఈ పుస్తకంలో ఒక చోట ఆ ఎస్టీ కాలనీలో ఒక దృశ్యం పాఠకుడికి ఇలా ఎదురవుతుంది: ''గుడి పక్కనే ఒక మొండి గోడల ఇల్లు... తలుపు సగం ఊడిపోయి, ఎప్పుడూ మూయాల్సిన అవసరమే లేనట్టు. బయటే నులక మంచం పైన ఒక సగం మనిషి కూర్చునో లేదా పడుకునో ఉంటాడు. పగల్లో కానీ, రాత్రుల్లో కానీ అతడు నిద్రలోకి వెళ్ళి వస్తుంటాడు. మెలకువలో కూర్చుని గుడ్డ పేలికలతో తాడు పేనడమో, వెదురు దబ్బల్తో తట్టో, బుట్టో, చాటో అల్లడమో చేస్తుంటాడు. రాత్రని, పగలని అతడికి స్పృహ ఉండదు. వానా, చలి, ఎండా ఏ తేడా తెలీదు. అతడి లోకం అతడిదే.'' ఈ వర్ణనతో అక్కడి దృశ్యం క్రమక్రమంగా మనకు స్పష్టమవుతూ కనిపిస్తూ వుంటుంది. అక్కడి మనుషుల జీవన విధానం, అక్కడి పరిస్థితులూ ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతూ వుంటాయి.
ఇందులో ఆ ''సగం మనిషి''ని మనకు చెప్పడానికి రచయిత అక్కడి మైన్యూట్ ఇష్యూస్‌ని కథలోకి తీసుకురావడాన్ని అభినందించకుండా వుండలేం. ఇలా చెప్పాలంటే ఆ రచయిత కచ్చితంగా ఆ కాలనీలో నివసించే వ్యక్తే అయి వుండాలి. లేదా అక్కడ జీవితాలతో ప్రత్యక్ష అనుబంధాలను కలిగి వుండాలి. లేకపోతే ఈ విధమైన నెరేషన్ వీలుకాదు.
ఇందులో ఒక పాత్ర మనతో చెప్తుంది: ''ఒకరి బాధలు ఒకురికి చెప్పుకోవల్లంటే ఒకరి కష్టానికి ఒకురు రావల్లంటే అంతా ఒక్కచోట వుంటే మంచిది కదా వదినా'' అని. ఎవరి బతుకు బాధల్లో వాళ్ళు ఎవరికి వారై వేరై పలుచోట్లకు పోతుంటే, ఎదురైన పీడనని ఎదుర్కోవడం సాధ్యం కాదనే స్పృహ అంతర్లీనంగా ధ్వనిస్తుందీ మాటల్లో. ''పందుల్ని మేపినా, గాడిదల పైన ఉప్పు అమ్మినా, తట్టా బుట్టా అమ్మినా, యెర్రమన్ను, ముగ్గుపిండి అమ్మినా మనల్ని అడిగేవోడు లేదు. మన కాళ్ళపైన మనం నిలబడి మన కష్టం తింటూ ఉండామే కానీ ఉన్నప్పుడు తిని, లేనప్పుడు పస్తయినా వుండామే కానీ ఏ పొద్దూ ఎవరి సొత్తుకు అయినా పోతాండామా,'' అని అదే పాత్ర చెప్తూన్నపుడు మనకి ఆ మనుషుల బతుకు చిత్రాలు కనిపిస్తాయి. వృత్తులు స్పష్టమవుతాయి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, బరువులూ అర్థమవుతాయి. ''ఇప్పుడు వాళ్ళందరూ ముసలి వాళ్ళయిపోయారు, వాళ్ళను కదిలిస్తే చాలు కన్నీళ్ళు జలజలా నేల రాల్తాయి. బతుకుదారులు వేరైనా వాల్లందరివీ కంటికి కడవెడు కన్నీళ్ళు నింపుకున్న కతలే'' అని రచయితే ఒక చోట అంటాడు. అతని మాటల్లో ఆ నేలరాలిన కన్నీళ్ళని రికార్డు చెయ్యాలనే తపన కనిపిస్తుంది. ఈ వ్యథలు బయటి ప్రపంచానికి తెలియచెప్పాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఇదా మన భారతం అని ఎవరినో ప్రశ్నిస్తున్నట్టనిపిస్తుంది.
'ఏకలవ్య కాలనీ' సంపుటిలోని కథలన్నీ ఒక ప్రశ్నతో ముగుస్తాయి. ముగిసిన తరవాత పాఠకునిలో ఒక అలజడికి, ఆలోచనకి కారణమవుతాయి. ఈ ప్రశ్నలన్నీ పాఠకుడిలో ఒక మెలకువని కలిగిస్తాయి. అంటే కథ ముగిసిన తరువాత మథనం ప్రారంభమవుతుంది. అదే కదా సాహిత్యం అంతిమ లక్ష్యం. ఆ పని సులభంగా చేస్తాయీ కథలు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సొన్నదంటే: ఇవన్నీ ఎరుకల కథలు. ఇంతదాకా ఎవరూ తడమనివి. తడిమినా ఇంత లోతుల్లోంచి చెప్పినవి కాదు. పలమనేరు బాలాజీ ఇప్పటికే కథకునిగా, కవిగా అందరికీ పరిచయమైనవారు. నా అంచనా తప్పు కాకపోతే ఆయన ఇంతకుముందు రాసిన పలు కథాకవిత్వాలకూ, ఈ పుస్తకానికీ స్పష్టమైన తేడా వుంది. అది అస్తిత్వ పరామర్శ. నా ఉద్దేశ్యం వాటిల్లో ఈ స్పృహ లేదని కాదు. ఇందులో బలంగా వున్నదని.
ఇన్నాళ్ళూ వివక్ష, అణచివేత, పీడనలు దళితజీవితాల్లో మాత్రమే ఉన్నాయ నుకునేది సమాజం. అంటరానితనం ఒక్క దళితులకు మాత్రమే ఎదురయ్యేది అనే అవగాహన వుండేది. కానీ అంటరానితనం గిరిజన కులాల్లో కూడా ఒక ముల్లులా గుచ్చుకుంటున్నదన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేసాయి ఈ కథలు. నొప్పిని భరిస్తున్న కమ్యునిటీస్ లోంచి ప్రశ్నించడం మొదలయ్యింది అని ప్రకటిస్తున్నాయి ఈ కథలు.
ఈ కథల్లో ఒక పాత్ర అంటుంది: ''ఈ దేశానికి ఒక్క అంబేద్కర్ చాలడు. ఇంటికొక్క అంబేడ్కర్ రావల్ల'' అని. ఎనభైయ్యేళ్ళ ఆ పాత్ర అంబేడ్కర్‌ని అణువణువునా జీర్ణించుకున్న ఉడుకోడు పాత్ర. ''ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా, పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బతకాలంటే కరువుతోనే కాదు, మొండిమేఘాలతోనే కాదు, మొండి మనుషులతో, పెద్ద కులమోళ్ళతో పోరాటాలు చెయ్యడం నేర్చుకోవల్ల'' అని ఉడుకోడు తోటి వారిని చైతన్యపరుస్తుంటే- ఆ ఒక్క ఎస్టీ కాలనీకి చెందిన వారికే కాదు పీడితులందరికీ తత్వబోధ చేస్తున్నాడని మనకి ఇట్టే అర్థమైపోతుంది. ''బతికేదానికి వయసుతో పనేముంది మామా, ఏ వయసోడికైనా బతకాలంటే నెత్తురు ఉడుగ్గానే ఉండల్ల. అసలు మనిషనేవాడు ఎప్పుడూ ఉడుకుడుగ్గానే ఉండల్ల,'' అని కుండబద్దలుకొట్టినట్టు చెప్తుంది ఉడుకోడు పాత్ర.
సాహిత్యలోకంలో బలహీనంగా వున్న గిరిజన స్వరం బృందగానంగా మారడానికి గొంతెత్తిన చైతన్యస్వరమీ కథలు. కథల్లో, కవితల్లో ఇప్పుడిప్పుడే గొంతు విప్పుతున్న గిరిజన గళాలకి ఈ కథలు మార్గనిర్దేశం చేస్తాయి. వివిధ ఉపకులాలుగా వున్న అడవి బిడ్డలకు ఈ కథలు కొత్త పాఠాలు నేర్పుతాయి. ప్రతి ఉపకులం నుంచీ ఇలాంటి కథలు రావాలన్న సందేశాన్ని పంపుతాయి.
ఎవరి పెయిన్‌కి వాళ్ళే అరవాలి, వాళ్ళే ఆ పెయిన్‌ని ప్రకటించుకోవాలి. అది ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. ఆ డెమొక్రటిక్ స్పేస్‌కి నిజమైన డెఫినిషన్‌ని ప్రకటిస్తాయి ఈ కథలు. ఇందులో ప్రతి కథా తెగిన ఏకలవ్యుడి బొటన వేలే. చెప్పిన ప్రతి సంఘటనా నేల రాలిన ఏకలవ్యుడి నెత్తుటి బొట్టే. ప్రతి అక్షరమూ వేలుని తెగ్గోయడం వెనక దాగిన కుట్రల్ని బహిర్గతం చేసేదే. అందుకే ఈ కథలు చరిత్రని తిరగ రాయాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్తాయి. ఈ కథలతో బాలాజీ ముందుండి గిరిజన స్వరాన్ని ఎత్తుకున్నందుకు అతన్ని హత్తుకోవాల్సిందే.
మల్లిపురం జగదీశ్
94401 04737
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

