నిత్యజీవితంలో ఓటమికీ, పతనానికీ, విషాదాంతానికీ కారణాలు చెప్పాల్సివస్తే... కర్ణుడితో పోలిక తేవడం మన తెలుగువారి అలవాటు. సంభాషణల్లో, ప్రసంగాల్లో, రాతల్లో, సాహితీ చర్చల్లో ఇది తరచూ జరిగేదే.
విషయాన్ని బలంగా, మనసుకు హత్తుకునేలా చేయగల ప్రతీక ఇది. 'కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్టు..' అంటూ చెప్పేవాళ్లున్నారు. ఆ కారణాలు వంద అనీ, (సవా)లక్ష అనీ కొందరంటుంటారు. ఇంకొంతమందైతే 'కోటి కారణాల'ని చెప్తుంటారు. ఆ లెక్క ఏమిటో తేల్చకుండా 'కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టు' అంటూ గడుసుగా పోల్చేవాళ్లూ కనిపిస్తారు. ఇక్కడ వారు చెప్పే సంఖ్యకు ప్రాధాన్యం లేదనీ, 'లెక్కలేనన్ని కారణాలు' అనేది వారి భావమనీ తెలుస్తూనే ఉంటుంది. ఇంతకీ కర్ణ కథ ఉన్న 'మహాభారతం' కర్ణ వధకు కారకులు ఎందరని చెప్తోంది? దీంతోపాటు జనశ్రుతిలో ఉన్న, బహుళ ప్రాచుర్యం పొందిన చాటువు విశేషాలేమిటి?
'కర్ణుడు లేని భారతం - శొంఠి లేని కషాయం', 'కర్ణునితో భారతం సరి.. కార్తీక మాసంతో వానలు సరి'... ఇలాంటి సామెతలూ, నానుడులూ ఈ ఇతిహాసంలో కర్ణుడి పాత్ర ప్రాముఖ్యం ఎంతటిదో చెప్తున్నాయి. జననం, మరణం.. ఈ రెండూ మాత్రమే కాకుండా జీవిత పర్యంతం కర్ణుడి ప్రస్థానం విషాదభరితం. చేసిన దానం, ఇచ్చిన వరం, నిందలూ, శాపాలూ, అవమానాలూ... ఇవన్నీ అతడి పతనానికి దారులు పరిచాయి.
వేల ఏళ్ల క్రితం వేద వ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతం శాంతిపర్వం ఐదో అధ్యాయంలో -
బ్రాహ్మణస్యాపి శాపేన రామస్య చ మహాత్మనః
కుంత్యాశ్చ వరదానేన మాయయా చ శతక్రతోః
భీష్మావమానాత్సంఖ్యాయాం రథానామర్ధకీర్తనాత్
శల్యతేజో వధాచ్చాపి వాసుదేవనయేనచ
అంటూ నారదుడు చెప్పిన విషయం శ్లోక రూపంలో ఉంది. దీని ప్రకారం- కర్ణుని మరణానికి ఏడు హేతువులు. బ్రాహ్మణ శాపం, పరశురాముని శాపం, కుంతీదేవి పొందిన వరం, ఇంద్రుడి మాయ, భీష్ముడి అవమానం, శల్యుడి హేళన, కృష్ణుడి వ్యూహం. ఇంతకీ చంపినవాడు ఫల్గుణుడు కదా? అతడి ఊసేదీ? అందరికీ తెలిసిన సత్యమే కాబట్టి వేదవ్యాసుడు నారదుడితో అర్జునుడి పేరును ప్రత్యేకంగా చెప్పించి వుండకపోవచ్చు.
ఇదే శ్లోకాన్ని 13వ శతాబ్దిలో 'శ్రీమదాంద్ర మహాభారతం'లో తిక్కన ఇలా అనువదించాడు- (శాంతిపర్వ ప్రథమాశ్వాసంలోని 35వ చంపకమాల పద్యం):
'వినుము నరేంద్ర! విప్రుడలివెన్, జమదగ్నిసుతుండు శాపమి
చ్చె, నమరభర్త వంచనము చేసె, వరంబని కోరి కుంతి మా
న్చెనలుక, భీష్ముడర్థరథు జేసి యడంచె గలంచె మద్రరా
జనుచితమాడి, శౌరి విధియయ్యె, నరుండటు జంపె గర్ణునిన్'
('ధర్మరాజా! నేను చెప్పేది విను. బ్రాహ్మణుడు కోపగించి యుద్ధంలో రథచక్రం భూమిలోకి కుంగిపోతుందని శపించాడు. తర్వాత పరశురాముడు తాను నేర్పిన దివ్యాస్ర్తాలు అవసరమైనపుడు పనిచేయబోవని శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసం చేసి సహజ కవచ కుండలాలను గ్రహించాడు. కుంతి వరమనే నెపంతో కోరి అతడి కోపాన్ని మాన్పింది. భీష్ముడు కర్ణుడిని అర్థరథుడిగా చేసి అగౌరవపరిచాడు. శల్యుడు అనుచిత వాక్కులతో హృదయాన్ని కలతపెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరగ్గా అర్జునుడు కర్ణుడిని రణరంగంలో వధించగలిగాడు.)
తెలుగు భారతంలో 'నరుండటు జంపె గర్ణునిన్' అంటూ తిక్కన అర్జునుడినీ చేర్చి లోటు తీర్చాడు! ఇలా తెలుగు భారతం ప్రకారం.. ఎనిమిది మంది కారకులు.
ఈ జాబితాలో ఉన్న బ్రాహ్మణుడినీ, భీష్ముడినీ, శల్యుడినీ తీసివేస్తే ఐదుగురు. వారికి ధర (భూదేవి)ను కలిపి ఆ ఆరుగురే కర్ణుడి చావుకు కారకులంటూ... అర్జునునికి కృష్ణుడే చెప్పినట్టు ప్రచారంలోకి వచ్చిందో కంద పద్యం.
'నరవర! నీచే నాచే
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధరచే భార్గవు చేతన్
అరయంగా కర్ణుడీల్గె నార్గుర చేతన్'
ఈ చాటుపద్య సృష్టికర్త ఎవరో ఎవరికీ తెలియదు. కవిత్వ సంపద లేకపోవచ్చు కానీ.. సూటిగా తేటగా చెప్పిన పద్యమిది అని పండితుల ఉద్దేశం.
ఈ చాటువుకు మూలం ఏమై వుంటుంది? భారతానికి అనుబంధంగా 'భారత సార సంగ్రహం'గా పేరుకెక్కిన చిన్న పుస్తకం 'భారత సావిత్రి'. 17వ శతాబ్దికి చెందిన నీలకంఠ చతుర్థర మహాభారత వ్యాఖ్యానాన్ని పరిష్కరించి మహారాష్ట్ర పండితుడు రామచంద్రశాస్ర్తి కింజ్ వాడేకర్ 1936లో దీన్ని ప్రచురించారు. దీనిలో ప్రక్షిప్తాలు (కవి రాసిన గ్రంథంలో తర్వాతి కాలం కవులు చేర్చిన భాగాలు) ఉన్నాయనే వాదన ఉంది. దానిలోదే ఈ శ్లోకం-
'త్వ(యా) మయా చ కుంత్యాచ ధరణ్యా వాసవేన చ
జామదగ్న్యేన రామేణ షడ్భిః కర్ణో నిపాతితః'
దీన్ని దాదాపు యథాతథంగా తెలుగు చాటువుగా మలిచారని ఊహించవచ్చు. అయితే, 1936కి ముందే తెలుగు చాటువు ప్రాచుర్యంలో ఉంది. అంటే అంతకు పూర్వం ఉన్న ఏదో ఒక ప్రచురణలోని ఇదే శ్లోకం ఆధారంతో చాటువు పుట్టి వుంటుంది. ('కర్ణ, శాంతి పర్వాల' తిక్కన భారత ఆంధ్రీకరణ 13వ శతాబ్దిలోనే పూర్తయింది.)
'ధరణి శాపం' భారతంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు గురువాజ్ఞతో కర్ణుడు నేతిని పాత్రలో తెస్తుండగా అది జారి భూమ్మీద పడి ఒలికిపోయింది. మళ్లీ నేతిని తేవడానికి వెళ్తే సమయం మించిపోయి గురువు కోపగిస్తాడనే భయంతో అక్కడినేలను బలంగా పిండి, నేతిని పాత్రలోకి నింపుకుంటాడు. తనను నిర్దయగా బాధపెట్టాడని కోపించిన భూదేవి యుద్ధసమయంలో అతడి రథచక్రం తనలో కుంగిపోతుందంటూ కర్ణుడికి శాపమిస్తుంది. లోకంలో ప్రసిద్ధంగా ఉన్న ఈ కథ ప్రస్తావనే చాటువులోనూ, శ్లోకంలోనూ చేరింది. ఈ చాటువుకు పాఠ భేదాలు కూడా కనిపిస్తాయి.
'నరు చేతను నా చేతను
వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్
ధర చేత శల్యుచేతను
అరయంగా గర్ణుడీల్గె నార్వుర చేతన్' - ఇలా... పరశురాముడి స్థానంలో శల్యుడిని జోడించడం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ''నీ చేతను నా చేతను'' అంటూ తొలి పాదం.. ఛందోబద్ధం కానప్పటికీ లోకుల నోట నానటం ఓ విశేషం.
వేటూరి ప్రభాకరశాస్ర్తి సేకరించి సంకలనం చేసిన 'చాటుపద్య మణిమంజరి' రెండు భాగాల్లోనూ (1913, 1922), దీపాల పిచ్చయ్యశాస్ర్తి రూపొందించిన 'చాటు పద్య రత్నాకరము' (1917)లోనూ ఈ చాటువు చోటుచేసుకోలేదు. కానీ ఆ కాలానికే ఈ చాటు పద్యం ప్రాచుర్యంలో ఉంది. ఈ చాటువును మూడు తెలుగు పుస్తకాల్లో ప్రముఖంగా ప్రస్తావించారు: 1917లో రాసి 1928లో వజ్ఝల చినసీతారామశాస్ర్తి వచన రచన 'కర్ణ చరిత్ర', 1929లో సోమరాజు రామానుజరావు రచించిన నాటకం 'దానవీర కర్ణ', 1935లో మ. శ్రీరామమూర్తి ఇదే పేరుతో రాసిన మరో నాటకం.
1927-28లో గుర్రం జాషువ రచించిన 'భారత వీరుడు' పద్యాలు 'భారతి'లో వెలువడ్డాయి. అంటే దాదాపు వందేళ్ల క్రితం! అందులో కర్ణుడిని శ్లాఘిస్తూ- అన్యాయంగా వధించారని బాధపడుతూ అతడిని ఓదారుస్తూ రాశారు కవి.
'నా యరదంబు క్రుంగిన దనంత, కిరీటి, క్షణంబు తాళుడో
యీ! యిది యుద్ధధర్మమ'ని యీవు వచించుచున్న నిన్ను న
న్యాయముగా వధించిన ధనంజయుడా విజయుండు నీవు కా
వా, అకటా! యిదెక్కడి నిరర్థక ధర్మము సూర్యనందనా!'
ఇదే పంథాలో జ్ఞానానంద కవి 1955లో తాను ప్రచురించిన 'పాంచజన్యము' అనే ఖండ కావ్యంలో కర్ణుడి గురించి రాశారు.
'అనుకంపమ్మొక యింతలేక కుటిల వ్యాపార పారీణులై
యనిలో నీ యరదంబు గ్రుంగ నిను నన్యాయముగా జంపె వె
న్నుని మోసాల నెరుంగలేక విజయుండున్ భండన క్షోణిలో
నినజా! లేనియెడన్ జయంబచట నీదే సుమ్ము ముమ్మాటికిన్'
ఇలా ఓ ఇతిహాసంలోని పరాజిత పాత్రను సొంతం చేసుకుని అతడిని సమర్థిస్తూ, ప్రేమగా కరుణ రసాత్మక పద్యాలు అల్లటం కర్ణుడి విషయంలోనే కనిపిస్తుంది!
సీహెచ్. వేణు
91770 04844
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

